గజారోహణం శోభాయాత్ర
తేది 01-05-2015న ఆశ్రమ సభ్యుల సహకారంతో నిర్మించిన పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ చంద్రయార్యుల మరియు గురుదేవుల స్మారక మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వారి ఆకాంక్ష మేరకు వారికి గజారోహణం, శోభాయాత్ర మగ్దుంపూర్ గ్రామంలో నిర్వహించబడింది.
నారాయణసేవ – ఉచిత అన్నదాన కార్యక్రమం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చేతిలో విలవిలలాడగా, అటువంటి రోగులకు సహాయ పడటానికి వచ్చిన వారికి ఆరోగ్యకరమైన మరియు అందరికి సత్ప్రవర్తన, తీసుకునే ఆహారము ద్వారా కలిగించటం కొరకు, ఆశ్రమం ద్వారా “నారాయణసేవ” అనే పేరుతో, ఉచిత అన్నదాన కార్యక్రమం సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఇతర ప్రదేశములలో రోజు దాదాపు 100 నుండి 125 మందికి అందించబడుచున్నది.
ఉచిత వైద్య కార్యక్రమం
గ్రామాలలో ఉన్న ప్రజలు అనేక రోగాల బారినపడి, సరైన వైద్య సహాయం లేక, దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యం లేక, పడుతున్న అవస్థల నుండి వారికీ బాసటగా నిలిచి, ఉచిత వైద్య సహాయం అందించుటకు ఆశ్రమం ద్వారా స్వర్గీయ బి.భాస్కరరావు స్మారక ఉచిత వైద్య శిబిరం తేది 18-01-2015 నుండి నిర్వహించబడింది. దీనికి సిద్ధిపేట నుండి డా.గాయత్రి గారు, డా.మల్లయ్య గారు, డా.ప్రసాద్ గారు వారి యొక్క ఎంతో విలువైన సమయాన్ని వినియోగించి సేవలు అందించారు. కాలాంతరంలో ప్రజలు ఆసక్తి చూపని కారణంగా నిలిపి వేయబడింది.
గోశాల నిర్వహణ
వెల్కటూర్ గ్రామంలో ఆశ్రమం చేత గోశాల నిర్వహించబడుతున్నది. చాలావరకు దేశీవాలి గోవులు దాతలు ఇచ్చిన దానంగా అందినవి. ప్రస్తుతం 4 ఆవులు 1 కోడె 10 దూడలు వున్నవి. గోశాల నుండి సేకరించిన ఆవునెయ్యితోనే యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
వ్యవసాయ క్షేత్రం
ఆశ్రమానికి 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రం వెల్కటూర్ లో వున్నది. అందులో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ధాన్యం, కందులు వగైరాలు ఉత్పతి చేసి ఆశ్రమంలో వినియోగించడం జరుగుతున్నది.
సాంస్కృతిక మరియు భక్తియుత కార్యక్రమాలు
ఆశ్రమంలో ప్రతి ఏటా బతుకమ్మ మరియు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి. కోలాటాలు ఉట్టి కొట్టడం, జానపద నృత్యాలు నిర్వహించబడతాయి. సాధకులకు రెండు ఆశ్రమములోనూ ప్రతి రోజు తెల్లవారు జామున 04:15 నిమిషాలకు మరల సాయంత్రం 06:30 నిమిషాలకు యోగసాధన ఉంటుంది. ఉదయం 05:15 నిమిషాలకు మరియు రాత్రి 9:00 గంటలకు గురుదేవులకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి, శ్రీరామనవమి, వరలక్ష్మీ వ్రతం, వినాయక వ్రతం, దేవి నవరాత్రులు, కార్తీకమాస పూజలు వగైరాలు నిర్వహించబడతాయి. ఇవి కాకుండా మగ్ధుంపూర్ లో గురుదేవుల వర్థంతి సందర్భంగా వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఆ గ్రామంలో అన్నదానం, శోభాయాత్ర, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా వెల్కటూర్ గ్రామంలో శోభాయాత్ర, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఆధ్యాత్మిక స్పృహ
ముముక్షువులకు మార్గ దర్శనం కొరకు ఆత్మ విచారణ భగవద్గీతలో చెప్పబడిన రాజయోగ సాధన, ఆహార నియమాలు, ఇంద్రియములు మరియు గుణముల క్రమబద్ధీకరణ వగైరా పద్ధతుల ద్వారా రెండు ఆశ్రమములలోను శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. వీటితో పాటు భగవద్గీత, ఉపనిషత్తులు, గరుడ పురాణం తదితర వేదపరమైన గ్రంథాల సారాంశం “అచల” అనే మీడియా ఛానల్ ద్వారా ప్రవచనాలు చెప్తూ ఆధ్యాత్మిక స్పృహ ప్రజలలో కలిగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇక ముందు ఇటువంటి ఇంకా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రణాళికలు ఉన్నాయి.
నిత్య హారతి కార్యక్రమాలు
ఉదయం 5:00 గంటలకు మేలుకొలుపు హారతి, రాత్రి 9:00 గంటలకు శయన హారతి, మహాశివరాత్రికి ముందు శివపార్వతుల కళ్యాణం.
మా ఆశ్రమం నిర్వహించిన కార్యక్రమాలు
➢ దివ్యజీవన యోగ సాధన క్రియలు.
➢ ఆశ్రమం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో యోగేశ్వర శ్రీరామలాల్ మహాప్రభుజీ ద్వారా మానవాళికి ఒసంగబడిన దివ్యజీవనతత్వ యోగ సాధన అనేటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా కేవలం 9 క్రియలతో సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 వరకు విద్యాలయాలలో 2015 నుండి ఇప్పటివరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కోవిద్ కారణంగా సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తిరిగి ఈ కార్యక్రమం కొనసాగింపబడుతుంది.
స్వాగత తోరణాలు
➢ ఆశ్రమం పరిధిలో ఉన్నటువంటి రెండు గ్రామాల ప్రధాన రహదారుల వద్ద గురుదేవుని జ్ఞాపకార్థం స్వాగత తోరణాలు 2020లో నిర్మించబడినవి.
➢ 2009లో వెల్కటూరు గ్రామంలో ఆశ్రమం ముందు కొన్ని సంవత్సరాల నుండి చెట్టు కింద పడి ఉన్న శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని జీర్ణోద్ధారణ చేసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడినది. ధ్వజస్థంభంతో పాటు పార్వతిపరమేశ్వరులను, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి పార్వతిమాతల దేవతామూర్తులను ప్రతిష్టించి, 2020 సంవత్సరంలో సంపూర్ణ దేవస్థానంగా మలచటం జరిగింది. ఇవేగాక అఖండ ధుని, శ్రీ సాయిబాబా విగ్రహం, నవగ్రహాల ప్రతిష్టాపన మొదలైనవి పూర్తి చేయబడినవి.